శేరిలింగంపల్లి : శంషిగూడ, హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్‌లో హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, రీ వైటల్ డెంటల్ హాస్పిటల్స్ సంయుక్త సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాలుగు ఆసుపత్రుల సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒకే వేదికపై వివిధ రకాల వైద్య పరీక్షలు, నిపుణుల సేవలు అందుబాటులోకి తీసుకురావడం కాలనీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇలాంటి వైద్య శిబిరాలు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు దోహదపడతాయని తెలిపారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

శిబిరంలో 2డీ ఈకో, ఈసీజీ, క్యాన్సర్ స్క్రీనింగ్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, చిన్నపిల్లల వైద్యం, ఆర్థోపెడిక్, చర్మవ్యాధులు, నేత్ర, దంత, ఈఎన్‌టీ, న్యూరాలజీ తదితర విభాగాలకు చెందిన నిపుణుల సేవలు అందించారు. అలాగే 18 రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు, ఎక్స్‌రే, కంటి పరీక్షలు నిర్వహించి అర్హులకు ఉచిత కళ్లజోడ్లు, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆరోగ్యం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక బాధ్యతతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం గొప్ప విషయమని గాంధీ అన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, వైద్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు.
అలాగే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, హెచ్‌ఎంటీ శాతవాహన నగర్ కాలనీ అధ్యక్షుడు రత్నప్రసాద్, ఉపాధ్యక్షుడు బాబురావు, ప్రధాన కార్యదర్శి యాదిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులు వెంకటరావు, రామనాథం, రామకోటేశ్వరరావు, హెచ్‌బీఎస్ అధ్యక్షుడు హనుమంతరాజు, డైరెక్టర్ రామ్మోహన్‌రావు, అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
