e-Paper
Thursday, July 30, 2026
Homeతెలంగాణహైదరాబాద్నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం

నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం

📰 Generate e-Paper Clip

హైదరాబాదులో 6 క్రిమినల్ కేసులు నమోదు..

వాహనాల స్వాధీనం.. హెచ్ఎస్ ఆర్పి తప్పనిసరి

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : నగరంలో నకిలీ, మార్పులు చేసిన లేదా అనధికారిక రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉపయోగిస్తున్న వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇటీవల పౌరుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో ఈ ప్రత్యేక అమలు చర్యలను మరింత ముమ్మరం చేశారు.

గత వారం రోజుల వ్యవధిలో నకిలీ లేదా తారుమారు చేసిన నంబర్ ప్లేట్లతో వాహనాలను నడుపుతున్న వ్యక్తులపై మొత్తం 6 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనల నుంచి తప్పించుకోవడం, వాహనాల అసలు గుర్తింపును దాచిపెట్టడం వంటి ఉద్దేశాలతో ఈ నంబర్ ప్లేట్లు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ చర్యల్లో భాగంగా పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులు జూబ్లీహిల్స్, మలక్‌పేట్, బేగంబజార్, అబిడ్స్, కాచిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదయ్యాయి.

హెచ్ఎస్ఆర్ పి నంబర్ ప్లేట్లు తప్పనిసరి

ప్రభుత్వం ఆమోదించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు మాత్రమే చట్టబద్ధమైనవని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లలో అక్షరాలు, అంకెలను మార్చడం, స్టిక్కర్లు అంటించడం, అంకెలను దాచిపెట్టడం లేదా అనధికారిక డిజైన్‌లను ఉపయోగించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.

జీరో టాలరెన్స్ విధానం

నకిలీ లేదా తారుమారు చేసిన నంబర్ ప్లేట్ల వినియోగంపై జీరో టాలరెన్స్ పాలసీ అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులతో పాటు వాహనాలను తక్షణమే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

వాహన యజమానులు తప్పనిసరిగా చట్టబద్ధమైన హెచ్ఎస్ఆర్ పి నంబర్ ప్లేట్లను ఉపయోగించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, చట్టబద్ధమైన రహదారి వినియోగం కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నగరవ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయెల్ డేవిస్, ఐపీఎస్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!