e-Paper
Sunday, September 13, 2026
Homeఇంటర్నేషనల్పరారీలో ఉన్న అంతర్జాతీయ నేరస్థులను భారత్‌కు రప్పించడానికి కేంద్రం కసరత్తు.!

పరారీలో ఉన్న అంతర్జాతీయ నేరస్థులను భారత్‌కు రప్పించడానికి కేంద్రం కసరత్తు.!

📰 Generate e-Paper Clip

విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు, వారి నిధుల నెట్‌వర్క్‌లు

సహాయక వ్యవస్థలపై కూడా చర్యలు

2019 నుంచి 2026 వరకు 36 దేశాల నుంచి 274 మంది గుర్తించిన భారత్‌పోల్

ఆదాబ్ సైబరాబాద్, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో 2019 నుంచి 2026 మధ్యకాలంలో ప్రపంచంలోని 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను భారత్‌కు అప్పగింపజేయడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైంది.

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు 2018లో ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్స్ చట్టం తీసుకురాగా, అనంతరం నిఘా ఆధారిత, సాంకేతికతతో కూడిన సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి నేరస్థుల అప్పగింత ప్రక్రియను వేగవంతం చేసింది.

గతంలో నత్తనడక.. ఇప్పుడు మిషన్ మోడ్

2014కు ముందు భారత్‌కు కేవలం 37 దేశాలతో మాత్రమే అప్పగింత ఒప్పందాలు ఉండేవి. ఆర్థిక నేరస్థులపై ప్రత్యేక చట్టం లేకపోవడం, పత్రాల లోపాలు, న్యాయపరమైన అడ్డంకులు, శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల 2004–2013 మధ్య సగటున సంవత్సరానికి కేవలం నలుగురు నేరస్థులను మాత్రమే భారత్‌కు రప్పించగలిగారు. అదే సమయంలో 110 అప్పగింత అభ్యర్థనలు పెండింగ్‌లో ఉండేవి.

జాతీయ ప్రాధాన్యంగా పరారీలో ఉన్న నేరస్థుల అప్పగింత

ప్రస్తుత ప్రభుత్వం పరారీలో ఉన్న నేరస్థులను తిరిగి భారత్‌కు తీసుకురావడాన్ని జాతీయ ప్రాధాన్య అంశంగా పరిగణించి, ప్రపంచ దేశాలతో సమన్వయం, దౌత్యపరమైన చర్చలు, సమాచార సాంకేతిక వినియోగం అనే మూడు కీలక వ్యూహాలతో ముందుకు సాగుతోంది.

చట్టాలకు మరింత బలం

2019లో ఎన్‌ఐఏ (సవరణ) చట్టం, యూఏపీఏ (సవరణ) చట్టం అమలులోకి రావడంతో విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు, వారి నిధుల నెట్‌వర్క్‌లు, సహాయక వ్యవస్థలపై కూడా చర్యల పరిధి విస్తరించింది.

2024లో అమలులోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల్లోని భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్లు 355, 356 ద్వారా పరారీలో ఉన్న నిందితులపై వారి గైర్హాజరీలోనే విచారణ నిర్వహించే అవకాశం కల్పించారు.

భారత్‌పోల్ తో వేగవంతమైన సమాచార మార్పిడి

2025 జనవరిలో ప్రారంభించిన భారత్‌పోల్ వేదిక ద్వారా సీబీఐ, రాష్ట్ర పోలీసు శాఖలు, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై అనుసంధానించారు. ప్రస్తుతం 1,400కుపైగా రాష్ట్ర, కేంద్ర సంస్థలు ఈ వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. దీంతో అంతర్జాతీయ సమాచార మార్పిడి గణనీయంగా వేగవంతమై, అనేక కేసుల్లో 3 నుంచి 10 రోజుల్లోనే సమాచారం అందుబాటులోకి వస్తోంది.

రూ.17,874 కోట్ల ఆస్తులు జప్తు

2019 నుంచి 2026 వరకు పరారీలో ఉన్న నేరస్థులకు చెందిన రూ.17,874 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జప్తు చేసింది.

అంతర్జాతీయ స్థాయిలో నేరస్థుల ఆచూకీని గుర్తించి త్వరగా పట్టుకునేందుకు సీబీఐ ప్రత్యేక గ్లోబల్ ఆపరేషన్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇంటర్‌పోల్‌తో ప్రత్యక్ష సమన్వయం, ప్రతి రాష్ట్రంలో ఇంటర్‌పోల్ సంప్రదింపు అధికారుల నియామకం ద్వారా పరారీలో ఉన్న నేరస్థులపై చర్యలు మరింత సమర్థవంతంగా కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!