జింద్–సోనిపట్ ప్రాజెక్టుతో గ్రీన్ రైల్వే దిశగా కీలక అడుగు
న్యూఢిల్లీ: హైడ్రోజన్ ఆధారిత రైళ్ల అభివృద్ధిలో భారత్ కీలక ముందడుగు వేసింది. జింద్–సోనిపట్ హైడ్రోజన్ రైలు ప్రాజెక్టుతో దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోలింగ్ స్టాక్, హైడ్రోజన్ నిల్వ, పంపిణీ, భద్రతా వ్యవస్థలు, నిర్వహణ విధానాలతో కూడిన సమగ్ర హైడ్రోజన్ రైల్వే ఎకోసిస్టమ్‌ను భారతీయ రైల్వే అభివృద్ధి చేసింది.

రైలులో అత్యాధునిక భద్రతా ప్రమాణాలను అమలు చేశారు. హైడ్రోజన్ లీకేజీ గుర్తింపు వ్యవస్థ, ఆటోమేటిక్ షట్‌డౌన్, మంటలను నియంత్రించే సాంకేతికత, లోకో పైలట్ భద్రత కోసం ప్రత్యేక క్యాబిన్, అత్యవసర పరిస్థితుల్లో రైలును సురక్షిత ప్రాంతానికి తరలించే వ్యవస్థలను ఏర్పాటు చేశారు. జింద్‌లోని హైడ్రోజన్ ప్లాంట్‌లో కూడా లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లు, ఆటోమేటిక్ షట్‌డౌన్, ఫైర్ అలారాలు, వాటర్ స్ప్రే వ్యవస్థలు అమర్చారు.

ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ఎన్ఎఫ్ పిఏ-2, ISO 19880 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది. అలాగే పేఈఎస్ఓ నిబంధనలను పాటిస్తూ, జర్మనీకి చెందిన ప్రముఖ సాంకేతిక తనిఖీ సంస్థ టీయూవీ ఎస్ఓడి స్వతంత్ర భద్రతా పరీక్షలు నిర్వహించి ఆమోదం తెలిపింది.

ప్రయాణికుల సేవల్లోకి తీసుకురావడానికి ముందు లోడ్ బాక్స్ పరీక్షలు, రేడియో ఫ్రీక్వెన్సీ పరీక్షలు, ఆపరేషన్ స్థిరత్వ పరీక్షలు, అత్యవసర బ్రేకింగ్ పరీక్షలు వంటి పలు కఠిన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ వంటి కొద్ది దేశాలు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను ప్రయోగాత్మకంగా లేదా పరిమిత స్థాయిలో నడుపుతున్నాయి. అయితే భారత హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు పరిమాణం, సామర్థ్యం, మౌలిక వసతుల పరంగా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
భవిష్యత్తులో కల్కా–షిమ్లా వంటి వారసత్వ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను వినియోగించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కార్యక్రమం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నెట్ జీరో లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషించనుంది.
