ఆదాబ్ సైబరాబాద్, నిజాంపేట్ : నిజాంపేట్ సర్కిల్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బకాయిలను వెంటనే జమ చేయాలని ఏఐటీయూసీ మున్సిపల్ రంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఏసు రత్నం డిమాండ్ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కార్మికులకు అందించే వర్షాకాల కిట్‌ను తక్షణమే పంపిణీ చేయాలని కోరారు.
ఈ మేరకు ఏఐటీయూసీ ప్రతినిధులు నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ షబీర్ అలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలం సందర్భంగా కార్మికులకు అందించే రెయిన్‌కోట్, సబ్బులు, నూనె, గ్లౌజులు, యూనిఫాం దుస్తులు, చెప్పులు తదితర వస్తువులతో కూడిన కిట్‌ను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తుండటంతో వారికి అవసరమైన భద్రతా సామగ్రి అందించడం అత్యవసరమని పేర్కొన్నారు.
అదేవిధంగా గత ఏడు నెలలుగా కార్మికుల పీఎఫ్ బకాయిలు జమ కాకపోవడం ఆందోళనకరమని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని కోరారు. గత నెలలో కొంతమంది కార్మికుల జీతాల్లో కోతలు విధించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ లోపాలను సరిదిద్ది పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని, సంక్షేమ చర్యలను వేగవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పొన్నకంటి దస్తగిరి, బక్క మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
