- మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్
ఆదాబ్ సైబరాబాద్, పరిగి: తెలంగాణ ప్రభుత్వం జూన్ 22 నుంచి 26 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవాల్లో భాగంగా పరిగి సబ్‌జైలులో గురువారం “నషా ముక్త్ భారత్ అభియాన్” వాల్ పోస్టర్‌ను జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి యువత వెన్నుముకలాంటివారని, అలాంటి యువత మాదకద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను అంధకారంలోకి నెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వ్యసనం వల్ల మానసిక స్థితిలో మార్పులు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.
అదేవిధంగా డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, ఇతర అవయవాలకు నష్టం కలగడంతో పాటు రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని, పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్థికంగా కూడా వ్యక్తులు తీవ్ర నష్టపోయి, కుటుంబాలపై భారంగా మారే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు.

డ్రగ్స్ విక్రయం, కొనుగోలు, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఆ సంకల్ప సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడటం సాధ్యమేనని, సరైన చికిత్స, కౌన్సెలింగ్ ద్వారా అనేక మంది తమ జీవితాలను తిరిగి గాడిలో పెట్టుకున్నారని తెలిపారు. ఇందుకోసం డి-అడిక్షన్ కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. తెలంగాణ జైళ్ల శాఖ రాష్ట్రంలోని కేంద్ర కారాగారాల్లో ‘నివృత్తి’ డి-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యసన బాధితులను మాదకద్రవ్యాల రహిత జీవితానికి మార్గనిర్దేశం చేస్తోందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ న్యాయవాది గౌస్ పాషా, పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ఐసీటీసీ కౌన్సిలర్ శోభన, జైలు సిబ్బంది హరికృష్ణ, ఫయాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
