అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కొలన్ హన్మంత్ రెడ్డి పిలుపు
ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ పరిధిలోని కైసర్‌నగర్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి స్థానిక మున్సిపల్ ఉప కమిషనర్ వెంకటరమణతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహణ తీరును సమీక్షించిన హన్మంత్ రెడ్డి, ఓటరు నమోదు ప్రక్రియను బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఓటరు జాబితాలో ఖచ్చితత్వం ఉండే విధంగా అవసరమైన వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు.
ప్రజలు బీఎల్ఓలు అందించే ఎన్యుమరేషన్ ఫారాలను సక్రమంగా నింపి సమర్పించాలని కోరిన ఆయన, 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న హన్మంత్ రెడ్డి, ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
