e-Paper
Saturday, August 1, 2026
Homeజాతియంఅంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం

అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం

📰 Generate e-Paper Clip

  • జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
  • “క్రీడలకు అవును.. మాదకద్రవ్యాలకు కాదు”
  • అనే సందేశంతో యువతకు అవగాహన

ఆదాబ్ సైబరాబాద్, జీడిమెట్ల : అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీలకు విశేష స్పందన లభించింది.

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 42 జట్లు పాల్గొన్నాయి. వీటిలో 10 బాలికల జట్లు, 16 బాలుర జట్లు, 16 పౌరుల జట్లు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పాటు జీడిమెట్ల పరిధిలోని పౌరులు కలిపి సుమారు 260 మంది క్రీడాకారులు పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి పాఠశాల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు విశేష సహకారం అందించారు.

టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి విజేతలు, రన్నరప్ జట్లకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. యువత తమ జీవిత లక్ష్యాలను సాధించేందుకు క్రీడలను అలవాటు చేసుకోవాలని, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.

కుత్బుల్లాపూర్ ఏసీపీ బాల గంగి రెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. యువత క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

జీడిమెట్ల ఎస్‌హెచ్‌ఓ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ, “క్రీడలకు అవును.. మాదకద్రవ్యాలకు కాదు” అనే సందేశాన్ని సమాజంలో విస్తృతంగా చాటిచెప్పేందుకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, పాఠశాలలు, స్థానిక పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం క్రీడాకారులందరితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి, సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, క్రీడాకారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!