- ప్రజల భద్రత, వ్యాపారుల ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనే మార్కెట్ కొనసాగించాలని విజ్ఞప్తి
ఆదాబ్ సైబరాబాద్, బాచుపల్లి : ప్రగతి నగర్ కూరగాయల మార్కెట్ నిర్వహణకు సంబంధించి మార్కెట్ యాజమాన్యం, స్థానికులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని బాచుపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్ నిర్వహిస్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు పెద్దగా లేవని తెలిపారు. అయితే మార్కెట్‌ను ప్రగతి స్కూల్ మెయిన్ రోడ్ వద్ద నిర్వహిస్తే ట్రాఫిక్ రద్దీ పెరగడంతో పాటు ప్రమాదాల అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల భద్రత, వ్యాపారుల సౌకర్యాలు మరియు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం కొనసాగుతున్న ప్రదేశంలోనే కూరగాయల మార్కెట్‌ను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కొలన్ హన్మంత్ రెడ్డిని కోరారు.
వారి వినతిని స్వీకరించిన కొలన్ హన్మంత్ రెడ్డి, స్థానిక ప్రజలు, వ్యాపారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో షరీఫ్ భాయ్, ప్రశాంత్, ఆంజనేయులు, కృష్ణారెడ్డి, భాస్కర్, మాణిక్యం, చిన్న ఆంజప్ప, బురాన్, లాల్ మొహమ్మద్, జహంగీర్, లక్ష్మి, నాగలక్ష్మి, కుమారి, రాము, మహాలక్ష్మి, మేరీకుమారి తదితరులు పాల్గొన్నారు.
