సైబర్ జాగృత దివస్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగృత దివస్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు, నకిలీ ఆఫర్లు, సోషల్ మీడియా తదితర మార్గాల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే సందేశాలు, లింకులు, ఆఫర్లను నమ్మవద్దని తెలిపారు.

“వినాయకుడు మనకు నేర్పే పాఠాలు – సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి” అనే సందేశంతో రూపొందించిన ఈ పోస్టర్‌లో సైబర్ నేరాల నుంచి రక్షణకు పలు సూచనలు చేశారు. అపరిచిత కాల్స్, మెసేజ్‌లు, లింకులు, అనుమానాస్పద ఆఫర్లను నమ్మకూడదని, OTP, UPI PIN, ATM PIN, CVV, పాస్‌వర్డ్ వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, పత్రాలను ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా పంచుకోవాలని సూచించారు. అలాగే సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ కాజోల్ జైస్వాల్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్‌ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
