భద్రాద్రి కొత్తగూడెం, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలు మరోసారి తీవ్ర వివాదానికి దారితీశాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ గోదావరి నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరాపురం, జానంపేట-1, జానంపేట-2, సింగిరెడ్డిపల్లి, ఈ-బయ్యారం-1, ఈ-బయ్యారం-2 ప్రాంతాల్లో మంజూరైన ఇసుక ర్యాంపుల పేరుతో కాంట్రాక్టర్లు యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొసైటీల పేర్లను అడ్డుపెట్టుకుని భారీ ఎక్స్కవేటర్లు, లోడర్లతో రాత్రింబవళ్లు ఇసుకను తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

నది మధ్యలోకి వెళ్లేందుకు గ్రావెల్, ఎర్రమట్టితో తాత్కాలిక రహదారులు నిర్మించడం, ఇందుకోసం రెవెన్యూ, అటవీ భూముల్లో తవ్వకాలు జరపడం పర్యావరణ ఆందోళనలకు కారణమవుతోంది. అక్రమ తవ్వకాలపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఈ దందా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రోన్ సర్వే నిర్వహించి అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులైన కాంట్రాక్టర్లు, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గోదావరి పరిరక్షణ కోసం జిల్లా కలెక్టర్, మైనింగ్, రెవెన్యూ, అటవీ శాఖలు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
