- రూ.35 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం
- ఐదుగురు అరెస్ట్
ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్ : రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముఠాపై పరిగి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సంయుక్త బృందం భారీ చర్య చేపట్టింది. జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.35 లక్షల విలువైన 20 క్వింటాళ్ల (53 బస్తాలు) నకిలీ పత్తి విత్తనాలను, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల దర్యాప్తులో నిందితులు కర్ణాటకలో పత్తి విత్తనాలను జిన్నింగ్ చేయించి, కిలోకు రూ.500 వ్యయంతో నకిలీ విత్తనాలను తయారు చేసి, వాటిని రైతులకు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా మాట్లాడుతూ, రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాల వ్యాపారానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలను విక్రయించినా, నిల్వ చేసినా లేదా రవాణా చేసినా సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేయాలని, రశీదులు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద విత్తనాల విక్రయాలపై వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
