తాండూర్ రూరల్ సర్కిల్ రికార్డ్ పరిశుభ్రత పై అరా
ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్ : వార్షిక తనిఖీలలో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మంగళవారం తాండూర్ రూరల్ సర్కిల్ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయాలను సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కార్యాలయాల పరిశుభ్రత, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, అనంతరం వివిధ రికార్డులు, కేసు ఫైళ్లు, పరిపాలనా పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించిన ఎస్పీ, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో వ్యవహరిస్తున్న పోలీసు సిబ్బందిని, వారి చక్కటి టర్నౌట్‌ను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే “సురక్ష మిత్ర” కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ చట్ట పరిధిలో త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఆమె సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
