- 126 మంది బాధితులకు రూ.27.38 లక్షల నిధుల రికవర్..
- 23 ఖాతా ఫిర్యాదుల పరిష్కారం
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: సైబర్ నేరాల బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన మెగా గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మాడ్యూల్ (GRM), మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (MRM) ద్వారా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన ఈ మెగా గ్రీవెన్స్ రెడ్రెస్సల్ డ్రైవ్లో సైబర్ నేరాల కారణంగా బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం, డీ-ఫ్రీజ్ చేయడం, లియెన్ తొలగింపు వంటి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి చట్టపరమైన నిబంధనల ప్రకారం పరిష్కరించారు.

ఈ కార్యక్రమంలో దర్యాప్తు అధికారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొని పెండింగ్ కేసులను సమీక్షించి అర్హత ఉన్న బాధితుల అభ్యర్థనలను ప్రాధాన్యతతో పరిష్కరించారు.

ముఖ్యాంశాలు:
- మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (MRM) ద్వారా 126 మంది బాధితులకు రూ.27,38,538 నిధుల పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి చేశారు.
- బ్యాంకు ఖాతాలకు సంబంధించిన 23 ఫిర్యాదులను పరిష్కరించగా, మరికొన్ని కేసులు పరిశీలనలో ఉన్నాయి.
ఈ సందర్భంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ కె. పుష్ప మాట్లాడుతూ, సైబర్ నేరాల బాధితులకు వేగవంతమైన ఉపశమనం కల్పించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
