- జోగులాంబ గద్వాల జిల్లాలో రూ.376.25 కోట్ల విద్యుత్ ఉపకేంద్రాల ప్రారంభించిన
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన
- ఎర్రవల్లిలో రూ.155 కోట్ల కొత్త మరో ఉపకేంద్రానికి పచ్చజెండా
ఆదాబ్ సైబరాబాద్, జోగులాంబ గద్వాల : రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో రూ.376.25 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు విద్యుత్ ఉపకేంద్రాలను ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మత్స్య, పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు.

వడ్డేపల్లి మండలం శాంతినగర్ హెలిపాడ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్న భట్టి విక్రమార్కకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జులేకల్ గ్రామానికి చేరుకుని ఆలంపూర్ నియోజకవర్గంలోని జులేకల్, పచ్చర్ల, పుల్లూరు, మేడికొండ ప్రాంతాల్లో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలను ప్రారంభించారు. అలాగే ఎర్రవల్లి మండల కేంద్రంలో రూ.155 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 220/132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతంతో రైతులు, గృహ వినియోగదారులు, పరిశ్రమలకు మెరుగైన సేవలు అందుతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, గొర్రెలు–మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, సంస్థ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
