e-Paper
Wednesday, September 16, 2026
Homeతెలంగాణహైదరాబాద్రహదారులు, పార్కులను కాపాడండి..

రహదారులు, పార్కులను కాపాడండి..

📰 Generate e-Paper Clip

హైడ్రా ప్రజావాణికి 56 ఫిర్యాదులు

హైదరాబాద్ : లేఅవుట్లలో రహదారులు, పార్కులు, ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులపై జరుగుతున్న ఆక్రమణలను తొలగించి ప్రజా ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 56 ఫిర్యాదులు అందాయి. అందిన వినతులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి, సంబంధిత అధికారులకు చర్యల కోసం పంపించారు. ఫిర్యాదుల్లో భాగంగా కుత్బుల్లాపూర్ సర్వే నంబర్ 148లో నాలాపై సుమారు 23 గుంటల భూమిని ఆక్రమించి ప్రహరీ నిర్మించారని ప్రజా బాధ్యతలు హక్కుల చైతన్య వేదిక ప్రతినిధులు ఆరోపించారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో 60 అడుగుల ప్రజా రహదారిని ఆక్రమించి అక్రమ ప్లాట్లు ఏర్పాటు చేశారని బాధితుడు బి. వెంకట్రామ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆక్రమణలను తొలగించి రహదారిని పునరుద్ధరించాలని కోరారు.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని సర్వే నంబర్ 79/1లో 80 పేద కుటుంబాల కోసం కేటాయించిన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిలో రెండు ఎకరాలు దేవాలయాల పేరుతో ఆక్రమించి నోటరీల ఆధారంగా ఇళ్లు, షెడ్లు నిర్మిస్తున్నారని రాజీవ్‌నగర్ రజక సేవా సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

చెంగిచెర్ల గ్రామంలోని శ్రీ సాయికృష్ణ ఎన్‌క్లేవ్‌లో 30 అడుగుల రహదారిని మూసివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వినతి సమర్పించారు. ఐలాపూర్ గ్రామంలో హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు అమల్లో ఉన్న భూముల్లోనూ ఆక్రమణలు కొనసాగిస్తూ ఆలయ నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకువచ్చారు.

ఇతర ప్రధాన ఫిర్యాదులు

అమీన్‌పూర్ మండలం బందంకొమ్ములో స్మశానవాటిక, వాటర్ ట్యాంక్, పాఠశాల కోసం కేటాయించిన 2.15 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. అలాగే బీరంగూడ సర్వే నంబర్ 993లో సుమారు 15 ఎకరాల భూమి కబ్జాకు గురైందని తెలిపారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో 63 ప్లాట్లతో ఉన్న 8 ఎకరాల లేఅవుట్‌లో రహదారులు, పార్కుల హద్దులు చెరిపేసి ఆక్రమణలు చేశారని సాఫ్ట్‌వేర్ అసోసియేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

గాజులరామారం దేవేందర్‌నగర్‌లోని చింతల చెరువు సమీపంలోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది.

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పశుమాముల గ్రామంలోని శ్రీ ఓం శాతి ఎన్‌క్లేవ్ లేఅవుట్‌లో రహదారులను ఆక్రమించి ప్లాట్లలో కలిపేశారని, వాటిని పరిరక్షించాలని బాధితులు కోరారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అందిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!