తెలిపిన మండల విద్యాధికారి రవీందర్ రాజు
పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ పూర్తి
మూడు పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్, పాల పంపిణీ ప్రారంభం
ఆదాబ్ సైబరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి : 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల విద్యాధికారి రవీందర్ రాజు తెలిపారు. సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి విద్యా సంవత్సరానికి సంబంధించిన సన్నాహాలను సమీక్షించినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను పాఠశాల స్థాయి వరకు చేరవేసినట్లు తెలిపారు. జూన్ 15 నుంచి విద్యార్థులకు వాటిని పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ మరియు పాల పంపిణీ కార్యక్రమం మొదటి దశలో భాగంగా కూకట్‌పల్లి మండలంలోని మూడు పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూకట్‌పల్లి, మండల ప్రాథమిక పాఠశాల కూకట్‌పల్లి బాలికలు, మండల ప్రాథమిక పాఠశాల కూకట్‌పల్లి బాలుర పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందజేయనున్నట్లు చెప్పారు.
పాఠశాలల ఆవరణలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటశాలలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో విద్య అందించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మాత్రమే కాకుండా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా వర్క్‌బుక్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే కొత్త డిజైన్లతో రూపొందించిన యూనిఫామ్‌లను త్వరలో విద్యార్థులకు అందజేయనున్నట్లు వెల్లడించారు.
విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) పెంపుతో పాటు వారి అభ్యసన సామర్థ్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మండల విద్యాధికారి తెలిపారు.
అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సంబంధిత అనుమతులు లేకుండా పాఠశాలలు లేదా తరగతులు నిర్వహించరాదని హెచ్చరించారు. విద్యార్థుల భద్రత, చైల్డ్ సేఫ్టీ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ విద్యా సంస్థలను నిర్వహించాలని ఆదేశించారు.
