ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి సంపాదించిన డబ్బును అక్రమంగా తరలిస్తున్న నెట్‌వర్క్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. డీసీపీ సైబర్ క్రైమ్స్ టి. సాయి మనోహర్ పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ వ్యవహారానికి సంబంధించిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, సైబర్ నేర ముఠాలు మోసాల ద్వారా సేకరించిన నగదును తరలించేందుకు ఉపయోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేయడం, ఖాతాదారులను సమకూర్చడం, మోసపూరిత లావాదేవీల ద్వారా వచ్చిన డబ్బును సేకరించి తరలించడం, మనీలాండరింగ్ కార్యకలాపాలకు సహకరించడం వంటి పనుల్లో నిందితులు కీలక పాత్ర పోషించారు.
అరెస్టైన వారిలో రాపర్తి గౌతమ్ (ఏ8), సేనాపతి పెంటయ్య (ఏ9), బోడాల సాయి కుమార్ (ఏ10), మురపాకల కుమార్ (ఏ11), విజ్జిపు సత్యనారాయణ (ఏ13), మంత్రి సాయి కుమార్ (ఏ14), ఉట్ల సత్యనారాయణ (ఏ15) ఉన్నారు.
నిందితులు సంఘటిత సైబర్ నేర ముఠాలకు బ్యాంక్ ఖాతాలు, ఖాతాదారులను సమకూర్చడంతో పాటు మోసాల ద్వారా వచ్చిన నగదును సేకరించి వివిధ ప్రాంతాలకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. వీరి అరెస్టుతో సైబర్ మోసాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. తమ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు, ఓటీపీలు, యూపీఐ పిన్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
