ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన బీజేపీ నాయకులు
ఉపాధ్యాయుల కొరత, అల్పాహారంపై ఆందోళన
ఆదాబ్ సైబరాబాద్, దుండిగల్: పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా దుండిగల్ సర్కిల్ బీజేపీ అధ్యక్షుడు, 295 బౌరంపేట డివిజన్ నాయకుడు పీసరి కృష్ణారెడ్డి బీజేపీ నాయకులతో కలిసి బౌరంపేట ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, మౌలిక వసతులు, విద్యా సామగ్రి తదితర అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితుల కారణంగా జూన్ 12న ప్రారంభం కావాల్సిన పాఠశాలలను జూన్ 15న ప్రారంభించినట్లు తెలిపారు. గత రెండు మూడు రోజులుగా ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలల్లోని పరిస్థితులను తెలుసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ యూనిఫాంలు ఇంకా పంపిణీ కాలేదని, కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని పేర్కొన్నారు.
బౌరంపేట ప్రాథమిక పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో కలిపి సుమారు 300 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ కేవలం ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కనీసం మరో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం, ఎంఈవో, డీఈవో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన ఉచిత అల్పాహార పథకం నేపథ్యంలో గతంలో అక్షయపాత్ర సంస్థ ద్వారా అందుతున్న అల్పాహారం ఈరోజు అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అల్పాహారం అందించే విషయంలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
బౌరంపేట డివిజన్ పరిధిలోని గండిమైసమ్మ, సరేగూడెం, బౌరంపేట, ఇందిరమ్మ కాలనీ, ఆర్‌జీకే కాలనీ, మల్లంపేట్ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అవకాశం ఉందని తెలిపారు.
తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలనే ఉద్దేశంతో అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు పడవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వం అనేక ఆధునిక సౌకర్యాలను కల్పిస్తోందని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడకుండా ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవాలని సూచించారు.
ప్రాథమిక, ఉన్నత పాఠశాలల అభివృద్ధికి బీజేపీ నాయకులు ఇప్పటికే అనేక సహాయ సహకారాలు అందించారని, భవిష్యత్తులో కూడా విద్యార్థులు, పాఠశాలల సంక్షేమం కోసం తమ వంతు సహాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దమ్మగారి ప్రభాకర్ రెడ్డి, తలారి బాలకృష్ణ, పాఠశాల చైర్మన్ ఆర్వీ మహేశ్వరి, ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి, ఉపాధ్యాయులు శ్రీధర్, శిల్ప, శ్రావణి, క్రాంతి, జైఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
