-
కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ స్థలాన్ని రక్షించిన రెవెన్యూ అధికారులు
-
అభినందనలు తెలియజేసిన నల్ల జయశంకర్ గౌడ్
ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : పెదబషీర్‌బాద్ గ్రామం సర్వే నెం.23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయడంపై సామాజిక కార్యకర్త నల్ల జయశంకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు రూ.100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అధికారులు తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. గత 15 నెలలుగా ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని, ఆక్రమణల నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కోరుతూ వివిధ స్థాయిల్లో అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.

మార్చి 2026లో కుత్బుల్లాపూర్ తహసీల్దార్ హైడ్రాకు లేఖ రాయడంతో పాటు, ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణ ప్రయత్నాలపై అదనపు కలెక్టర్‌కు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ ఎంఆర్వో రాజేష్ ఆధ్వర్యంలో అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని గుర్తించి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ పరిణామమని అన్నారు.
ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ, గత 15 నెలలుగా పలుమార్లు ఎంఆర్వో, కలెక్టర్ కార్యాలయాలకు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడం సంతోషకరమన్నారు.
స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిలో అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు, మిగిలిన స్థలాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కుత్బుల్లాపూర్ ప్రాంతంలో గతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బలరాం, ఎల్లస్వామి, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
