e-Paper
Saturday, August 1, 2026
Homeజాతియంరూ.107 కోట్లతో నాలుగు చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం

రూ.107 కోట్లతో నాలుగు చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

  • పూజలు చేసి పనులు ప్రారంభించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : నగరంలో వరదల నియంత్రణతో పాటు భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మరో నాలుగు చెరువుల అభివృద్ధి పనులకు హైడ్రా గురువారం శ్రీకారం చుట్టింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్‌లోని ఇబ్రహీం పెద్ద చెరువు, గండిపేట మండలం పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువు, కూకట్‌పల్లి మండలం మూసాపేటలోని కాముని చెరువు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాప్రాలోని కాప్రా చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ నాలుగు చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం మొత్తం రూ.107 కోట్లు వెచ్చిస్తోంది.

ఈ సందర్భంగా ఇబ్రహీం పెద్ద చెరువు, కాముని చెరువు వద్ద భూమిపూజ నిర్వహించిన కమిషనర్‌కు స్థానికులు స్వాగతం పలికారు. చెరువుల అభివృద్ధితో మురుగు సమస్యలు, దోమల బెడద తగ్గడమే కాకుండా పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారనున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

అభివృద్ధి పనుల్లో భాగంగా కాముని చెరువు 48 ఎకరాలు, ఇబ్రహీం పెద్ద చెరువు 97 ఎకరాలు, భగీరథమ్మ చెరువు 54 ఎకరాలు, కాప్రా చెరువు 112 ఎకరాల విస్తీర్ణంలో పునరుద్ధరించబడుతున్నాయి.

వరదల నియంత్రణ, భూగర్భ జలాల పెంపుదలే లక్ష్యం

చెరువుల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించి దుర్గంధ సమస్యను నివారించాలని, వరద నీరు సాఫీగా చేరేందుకు ఇన్‌లెట్లు, బయటకు వెళ్లేందుకు ఔట్‌లెట్లు అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ కాంట్రాక్టర్లకు సూచించారు. చెరువుల అభివృద్ధి ద్వారా వరదల నియంత్రణతో పాటు భూగర్భ జలాల పెంపుదల సాధ్యమవుతుందని తెలిపారు.

మొదటి విడతలో అభివృద్ధి చేసిన ఆరు చెరువుల మాదిరిగానే రెండో విడతలో చేపట్టిన 14 చెరువులను కూడా నాణ్యతతో అభివృద్ధి చేయాలని ఆయన ఆదేశించారు.

పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్న చెరువులు

చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, పాత్‌వేలు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆట స్థలాలు ఏర్పాటు చేసి అన్ని వయసుల వారికి అనుకూలమైన విహార కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు కమిషనర్ తెలిపారు. పెద్ద చెరువుల వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటింగ్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

చెరువుల అభివృద్ధిలో స్థానిక ప్రజలు కీలక పాత్ర పోషించాలని, పనులు నాణ్యతతో జరిగేలా సహకరించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!