ఆదాబ్ సైబరాబాద్, సైబరాబాద్ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇనార్బిట్ మాల్, మైండ్స్పేస్లో “కాఫీ విత్ ఎ కాప్” నాలుగో ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన పెంపొందించడం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించడం, సమాజంలో సురక్షిత వాతావరణాన్ని నెలకొల్పడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ క్రమశిక్షణ, సరైన జీవన విధానం విజయానికి పునాది అని పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, జీవితంలో ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఆయన సూచించారు.
సైబరాబాద్ మహిళా శిశు భద్రత విభాగం డీసీపీ కె. సృజన మాట్లాడుతూ, ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ ద్వారా విశ్వాసాన్ని పెంపొందిస్తూ మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.

ఎస్సీఎస్సీ డైరెక్టర్ (స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్) రష్మి శ్రీవాస్తవ సభకు స్వాగతం పలుకుతూ, యువత మరియు పోలీసుల మధ్య సానుకూల సంభాషణలకు ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్ ఆలమ్ ఖాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పాల్గొన్న వారితో ఆసక్తికరమైన ర్యాపిడ్ ఫైర్ సెషన్ నిర్వహించారు.

కార్యక్రమంలో ఈఎల్ఐసిఓ లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ వనిత దాట్ల, కే. రహేజా కార్ప్ డైరెక్టర్ (కమర్షియల్) శ్రవణ్ గోనే తదితరులు పాల్గొని మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు.
యువత సరైన నిర్ణయాలు తీసుకుని మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వక్తలు పేర్కొన్నారు. “ప్రతి నిర్ణయం… ప్రతి క్షణం… ప్రతి పరిణామం” అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
