కొత్త రాజోలిలోనే ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలి
11 గ్రామాల ప్రజల భవిష్యత్తు, ప్రభుత్వ రికార్డుల భద్రత కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ డిమాండ్
ఆదాబ్ సైబరాబాద్, గద్వాల : 2009లో తుంగభద్ర–కృష్ణా నదుల వరదలు పాత రాజోలి గ్రామాన్ని పూర్తిగా ముంపునకు గురిచేసిన విషాదాన్ని ప్రభుత్వం మరవకూడదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు మొరుగు వీరేష్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.2.25 కోట్లతో నిర్మించనున్న ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు భవిష్యత్తులో నిర్మించే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను వరద ముప్పు లేని కొత్త రాజోలి గ్రామంలోనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
2009 అక్టోబర్ 2 నుంచి 5 వరకు కురిసిన భారీ వర్షాలతో తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహించి, ఆనకట్టల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో కృష్ణా–తుంగభద్ర సంగమ ప్రాంతాలు జలమయమయ్యాయని ఆయన గుర్తు చేశారు. అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ఆలంపూర్ ప్రాంతంతో పాటు పాత రాజోలి గ్రామం పూర్తిగా వరద ముంపునకు గురై వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని, వేల ఎకరాల పంటలు, ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, రహదారులు, విలువైన ప్రభుత్వ రికార్డులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
వరదల అనంతరం ప్రభుత్వం ముంపు ప్రమాదం లేని ఎత్తైన ప్రాంతంలో కొత్త రాజోలిని ఏర్పాటు చేసి సుమారు 3,700 కుటుంబాలకు పునరావాసం కల్పించిందని, పాఠశాలలు, ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం 10 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కేటాయించిందని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఆ నిర్ణయానికి అనుగుణంగానే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా కొత్త రాజోలిలోనే ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ఇటీవల కొత్త రాజోలి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎంఆర్ఓ రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేసి, ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2.25 కోట్లతో నిర్మించనున్న ఎంఆర్ఓ కార్యాలయాన్ని కొత్త రాజోలిలోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే నిర్మించాలని కోరిన విషయాన్ని మొరుగు వీరేష్ ప్రస్తావించారు. ప్రజల డిమాండ్ పూర్తిగా సమంజసమైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
కొత్త రాజోలిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే వరద ముప్పు నుంచి శాశ్వత రక్షణ లభిస్తుందని, రెవెన్యూ, గ్రామపంచాయతీ, విద్య తదితర కీలక ప్రభుత్వ రికార్డులు భద్రంగా ఉంటాయని, మండలంలోని 11 గ్రామాల ప్రజలకు ఒకే కేంద్రంలో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. విశాలమైన ప్రభుత్వ భూమి, పార్కింగ్, భవిష్యత్తు విస్తరణకు అనుకూలమైన స్థలం ఉండటంతో పాటు ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని పేర్కొన్నారు.
ప్రజల వినతిపత్రాన్ని స్వీకరించి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎంఆర్ఓ రామ్మోహన్ హామీ ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమని మొరుగు వీరేష్ అన్నారు. 11 గ్రామాల ప్రజల భవిష్యత్తు, ప్రభుత్వ ఆస్తులు, కీలక రికార్డుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు భవిష్యత్తులో నిర్మించే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కొత్త రాజోలి గ్రామంలోనే ఏర్పాటు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఆయన మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు.

