e-Paper
Thursday, July 30, 2026
Homeజాతియం18న ‘ఛలో హైదరాబాద్’

18న ‘ఛలో హైదరాబాద్’

📰 Generate e-Paper Clip

  • జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం

  • గన్‌పార్క్‌ నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ నిర్వహణకు పిలుపు

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆరోపిస్తూ ఈ నెల 18న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రకటించారు.

హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం నలుమూలల నుంచి జర్నలిస్టులు, పత్రికల నిర్వాహకులు, కేబుల్ టీవీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చి ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమీపంలోని గన్‌పార్క్‌ నుంచి ర్యాలీగా బయలుదేరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, మీడియా రంగానికి చెందిన పలువురు పాల్గొననున్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చిన్న, మధ్య తరహా పత్రికలు, పీరియాడికల్స్‌కు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మామిడి సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు.

చిన్న, మధ్య తరహా పత్రికలు మరియు పీరియాడికల్స్‌కు రెండేళ్లుగా ప్రకటనల బిల్లులు చెల్లించలేదని, ప్రభుత్వ ప్రకటనలను కూడా గణనీయంగా తగ్గించారని ఆరోపించారు. అన్ని మీడియా సంస్థలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని, చిన్న, మధ్య తరహా పత్రికలకు క్రమం తప్పకుండా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే ఎంపానెల్‌మెంట్‌తో సంబంధం లేకుండా ప్రతి పత్రికకు నెలకు కనీసం ఒక ప్రకటన ఇవ్వాలని, ప్రింటింగ్ ప్రెస్‌ల స్థాపన కోసం నామమాత్రపు ధరకు ఒక ఎకరం భూమిని కేటాయించి రుణ సదుపాయాలు కల్పించాలని కోరారు. చిన్న, మధ్య తరహా పత్రికలను ఎంపానెల్‌మెంట్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని, కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లకు అక్రెడిటేషన్ కార్డుల సంఖ్య పెంచాలని, ఐపీ టీవీ న్యూస్ ఛానళ్లకు కూడా అక్రెడిటేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయడంతో పాటు మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 18న నిర్వహించే ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!