పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్: కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హుడైన ఓటరు భాగస్వామి కావాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ సర్కిల్ పరిధి రంగారెడ్డి నగర్ డివిజన్‌లో జరుగుతున్న ఓటరు మ్యాపింగ్ (రూట్ మ్యాపింగ్) కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి కూన శ్రీశైలం గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఎల్‌వోలు అందజేస్తున్న ఎన్యూమరేషన్ దరఖాస్తుల్లో ఓటర్లు తమ పూర్తి వివరాలను నమోదు చేసుకుని ఓటు హక్కును నిర్ధారించుకోవాలని సూచించారు. అలాగే రెండు ప్రాంతాల్లో పేర్లు ఉన్న ఓటర్లను గుర్తించి తొలగించడంతో పాటు నకిలీ ఓట్లను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని బీఎల్‌వోలకు సూచించారు. ఇటీవల 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా కొత్తగా ఓటరు నమోదు చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అనంతరం రంగారెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో షాకీర్, రమేష్ మంజూల్కర్, నారాయణ, మల్లం శీను, నవీన్ రెడ్డి, తోకల శీను, మహమ్మద్ కాజా, ముంతాజ్, బీఎల్‌వోలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
