ఢిల్లీలో ప్రధానమంత్రి నివాస ముట్టడి సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఘటనను నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్‌లో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ నుంచి కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రతిపక్ష నాయకులపై అనవసర చర్యలను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నీట్ పేపర్ లీకేజ్ ఘటన కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
